అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyclone Montha | తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన తీవ్ర తుపాను మొంథా తీరం దాటాక దిశ మార్చుకుంది. తెలంగాణ వైపు కదులుతోంది. నాలుగైదు గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాలకు రాబోయే కొన్ని గంటల్లో తక్షణ వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది. రాబోయే ఆరు గంటల్లో ఏపీలో, 24 గంటల్లో తెలంగాణ (Telangana), విదర్భా, మరఠ్వాడాలో తీవ్ర వర్షపాతం వల్ల వరద వచ్చే ఛాన్స్ ఉందనిపేర్కొంది. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి.
Cyclone Montha | పలు జిల్లాలకు అలర్ట్ జారీ..
తుపాను దిశ మార్చుకుని తెలంగాణ వైపు వస్తుండడంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఆరుగంటల్లో ఇది అల్పపీడనంగా మారుతుందని, దీని ప్రభావంతో అన్ని జిల్లాల్లో వానలు పడుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొదని.. వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర తిరగవద్దని హెచ్చరించింది. ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవాలని సూచించింది. రైతులు పంటలు, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని.. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని వాతావరణ శాఖ సూచించింది.

