అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyclone Montha | మొంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను అతలాకుతలం చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండగా, పలు జిల్లాల్లో జీవన విధానం పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అనేక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
తుపాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముంపు ప్రాంతాలు, తక్కువ ఎత్తున్న గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, తుపాన్ బీభత్సంలో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలంటూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు.
Cyclone Montha | భారీ నష్టం..
భారీ వర్షాలు (Heavy Rains) వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. రైతులు సాగు చేసిన పంటలు వర్షాలతో నష్టపోయాయి. ముఖ్యంగా వరి పంటకు పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో కోత దశలో ఉన్న వరి పంట వర్షాలతో నేలమట్టమైంది. ఈదురుగాలులు, కుండపోత వర్షాల కారణంగా మొక్కజొన్న, మినుములు, పత్తి వంటి పంటలు కూడా విపరీతంగా నష్టపోయాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 87,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. అందులో 59,000 హెక్టార్లు వరి పంటలే. సుమారు 78,796 మంది రైతులు (Farmers) ప్రభావితమయ్యారని ప్రభుత్వ అంచనా. అదేవిధంగా 42 పశువులు కూడా వర్షాల కారణంగా మృతి చెందాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇంకా పరిశీలనలో ఉన్నందున, ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
తుపాన్ ప్రభావం అత్యధికంగా కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, వైఎస్సార్ కడప, ఏలూరు జిల్లాల్లో కనిపించింది. వరి, పత్తి, మినుము, మొక్కజొన్నతో పాటు జొన్న, సజ్జ, రాగి, కంది, మిరప, పసుపు, కూరగాయలు, అరటి, బొప్పాయి, ఉల్లి, పూలతోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. మరోవైపు, ప్రభుత్వం పంటల నష్టంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి రైతులకు తగిన సాయం అందించేందుకు చర్యలు ప్రారంభించింది.

