అక్షరటుడే, వెబ్డెస్క్: Montha Cyclone Effect | బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని (Telanagana) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించనుంది. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సైతం భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 28, 29 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఆసిఫాబాద్ (Asifabad), మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, జనగామ, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి.
Montha Cyclone Effect | వాయుగుండంగా మారిన తుపాన్
మొంథా తీవ్ర వాయుగుండంగా మారిందని ఎన్డీఆర్ఎఫ్ (NDRF) అధికారులు తెలిపారు. రేపటికి తుఫానుగా, ఎల్లుండికి తీవ్ర తుఫానుగా మారనుందని చెప్పారు. కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు.
ఏపీలోని ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఆరు బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో, కృష్ణా జిల్లాలో 27, 28, 29 తేదీల్లో, కాకినాడ జిల్లాలో ఐదు రోజులు పాఠశాలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
