అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి వానలు దంచికొడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉదయం నుంచే వర్షం దంచికొడుతోంది. వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ నగరంలో జల్లులు పడుతాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Weather Updates | దంచికొట్టిన వాన..
తుపాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వాన దంచికొట్టింది. నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ (Amrabad)లో 155 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతుండటంతో వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Weather Updates | బలహీనపడుతున్న తుపాన్
మొంథా తుపాన్ క్రమంగా బలహీనపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. దీని ప్రభావం బుధవారం రాత్రి వరకు ఉండనుంది. రాత్రి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.