అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cyber Fraud | సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. అరెస్ట్‌ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ.. ఖాతాలను లూటీ చేస్తున్నారు. గిఫ్ట్‌లు, ట్రేడింగ్ పేరిట నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు సైబర్ నేరాల(Cyber Crime) బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ వృద్ధుడు సైబర్ నేరస్తుల చేతిలో ఏకంగా రూ.35.7 లక్షలు పోగొట్టుకున్నాడు.
హైదరాబాద్(Hyderabad) నగరంలోని దోమలగూడలో నివాసం ఉండే 79 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాము సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించారు. సదరు వృద్ధుడి బ్యాంక్ ఖాతాకు మనీ లాండరింగ్(Money Laundering) సంబంధం ఉందని బెదిరించాడు. అంతేగాకుండా నకిలీ ఎఫ్ఐఆర్(Fake FIR), అరెస్ట్‌కు సంబంధించి నకిలీ పత్రాలు(Fake Documents) సృష్టించి వాట్సాప్‌లో పంపారు. అంతేగాకుండా పోలీస్ యూనిఫామ్‌లో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆయనను అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. దీంతో బాధితుడు వారు చెప్పిన ఖాతాకు రూ.35.74 లక్షలు బదిలీ చేశాడు. స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్(Local Crime Branch Police Station)లో డబ్బులు తీసుకోవాలని వారు చెప్పారు. తర్వాత వాళ్లు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు(Cybercrime Police) ఫిర్యాదు చేశాడు.
Cyber Fraud | అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల (Cyber Frauds)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరు ఊరికే ఎవరూ గిఫ్ట్‌లు ఇవ్వరని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఎవరైనా ఫోన్ చేసి తాము పోలీసులం, సీబీఐ అధికారులమని(CBI Officers) చెప్పి బెదిరిస్తే భయపడకుండా ఉండాలన్నారు. అధికారులు అలా ఫోన్లు చేయరని చెప్పారు. అలాంటి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవద్దన్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి సమాచారం అందించాలని సూచించారు.