HomeUncategorizedCyber Crime | ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. కోట్లు కొల్ల‌గొట్టి.. వృద్ధుడిని బురిడీ కొట్టించిన‌ సైబ‌ర్...

Cyber Crime | ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. కోట్లు కొల్ల‌గొట్టి.. వృద్ధుడిని బురిడీ కొట్టించిన‌ సైబ‌ర్ మోసగాళ్లు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyber Crime | ఫేస్‌బుక్‌(Face Book)లో వ‌చ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓ వృద్ధుడి జీవితాన్ని అత‌లాకుత‌లం చేసింది. ఉన్న ఆస్తి పోవ‌డ‌మే కాదు ఆస్ప‌త్రి పాలు కావాల్సి వ‌చ్చింది. సైబ‌ర్ మోస‌గాళ్ల వ‌ల‌లో చిక్కిన స‌ద‌రు వృద్ధుడు ఉన్నదంతా ఊడ్చిపెట్టాడు. అంతేకాదు, ఆస్తి మొత్తం పోగొట్టుకుని ఆస్ప‌త్రి పాల‌య్యాడు. దాదాపు రెండు సంవత్సరాలు, 734 ఆన్‌లైన్ లావాదేవీలు(734 Online Transactions) జరిగిన ఈ స్కామ్‌లో, ముంబైలోని 80 ఏళ్ల వ్యక్తిని ప్రేమ పేరుతో దాదాపు రూ.9 కోట్లు మోసం చేశారు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

Cyber Crime | సైబ‌ర్ వ‌ల‌లో చిక్కి..

ఏప్రిల్ 2023లో బాధిత వృద్ధుడు ఫేస్‌బుక్‌లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్(Friend Request) పంపాడు. అయితే, ఆ ఇద్దరికీ ఒకరినొకరు తెలియక పోవ‌డంతో అటు వైపు నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించబడలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత, ఆ వృద్ధుడికి షార్వి ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, అత‌డు యాక్సెప్ట్ చేశాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. చివరకు ఇది తమ ఫోన్ నెంబర్లను ఇచ్చి పుచ్చుకునే వరకూ వెళ్లింది. తను భర్తతో విడిపోయి పిల్లలతో ఉంటున్నానని శార్వీ బాధితుడితో చెప్పింది. అలా మెల్లిగా వృద్ధుడ్ని ముగ్గులోకి దింపిన స‌ద‌రు మ‌హిళ‌.. త‌న క‌ష్టాలు చెప్పుకుంటూ క్రమంగా డబ్బు అడగడం ప్రారంభించింది. తన పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాన‌ని సాయం చేయాలంటూ కోరింది. ఆమె అడిగిన ప్రతీసారీ వృద్ధుడు డబ్బులు పంపించాడు.

Cyber Crime | మ‌హిళల‌ పేరిట‌..

ఈ వ్య‌వ‌హారం ఇలా కొన‌సాగుతుండ‌గానే, మ‌రొక‌రు రంగంలోకి దిగారు. కవిత పేరిట వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది. ఆమె తనను తాను షార్వికి తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకుని, నీతో స్నేహం చేయాలనుకుంటున్నానని చెప్పింది. అలా వారి మ‌ధ్య చాటింగ్‌లు, ఫోన్‌కాల్స్ పెరిగి చివ‌ర‌కు అసభ్యకర చాటింగ్ వరకూ వెళ్లాయి. ఈ క్రమంలోనే ఆమె కూడా వృద్ధుడి నుంచి డబ్బు తీసుకోవడం మొదలెట్టింది. అదే సంవ‌త్స‌రంలో షార్వి సోదరి అని చెప్పుకునే మరో మహిళ దినాజ్ కూడా వృద్ధుడితో ప‌రిచయం పెంచుకుంది. అనారోగ్యంతో షార్వి చ‌నిపోయింద‌ని, ఆస్ప‌త్రిలో బిల్లులు చెల్లించాల్సింద‌ని చెప్పింది. ఈ మేర‌కు షార్వితో గ‌తంలో చేసిన వాట్సాప్ చాట్‌(Whats App Chat) స్క్రీన్‌షాట్‌లను పంపించింది. దీంతో వృద్ధుడు డబ్బు పంపించాడు.

కొంత‌కాలం త‌ర్వాత తాను పంపించిన డ‌బ్బును తిరిగి ఇవ్వాల‌ని వృద్ధుడు కోరగా తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ దినాజ్ బెదిరింపులకు దిగింది. దీంతో వృద్ధుడు భ‌య‌ప‌డిపోయారు. ఆ తరువాత కొన్నాళ్ల‌కు దినాజ్‌కు ఫ్రెండ్‌‌గా చెప్పుకుంటూ మరో మహిళ వృద్ధుడితో ప‌రిచ‌యం పెంచుకుంది. ఆమె సైతం డ‌బ్బులు దండుకుంది. ఇలా గ‌త రెండేళ్ల‌లో బాధితుడు రూ.8.7 కోట్లను(Rs.8.7 Crore) మోస‌గాళ్ల‌కు ముట్ట‌జెప్పాడు. ఏప్రిల్ 2023 నుండి జనవరి 2025 వరకు, ఆ వృద్ధుడు 734 లావాదేవీలలో రూ. 8.7 కోట్లు చెల్లించాడు.

Cyber Crime | అప్పు అడగ‌డంతో వెలుగులోకి..

కోట్ల కొద్దీ డ‌బ్బు ఉన్న వృద్ధుడు అప్పు అడగ‌డంతో ఈ సైబ‌ర్ మోసం(Cyber Fraud) బ‌య‌ట‌ప‌డింది. త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బంతా కోల్పోయిన వృద్ధుడు అప్పు చేశాడు. దినాజ్ ఫ్రెండ్‌కు పంపించేందుకు కోడలి వద్ద రూ.2 లక్షలు అప్పు చేశాడు. మరో సందర్భంలో కొడుకునూ రూ.5 లక్షల అప్పు అడిగాడు. అనుమానం వ‌చ్చిన కుమారుడు డ‌బ్బు ఎందుకని ఆరా తీయ‌డంతో అస‌లు విష‌యం చెప్పాడు. చివ‌ర‌కు తాను మోస‌పోయాన‌ని గుర్తించిన బాధితుడు షాక్‌కు గుర‌య్యాడు. అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరాడు. అతనికి మానసిక స‌మ‌స్య‌లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. నలుగురు మహిళల పేరిట ఓకే వ్యక్తి ఈ వ్యవహారమంతా నడిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.