అక్షరటుడే, లింగంపేట: cyber fraud | సైబర్ నేరాలపై విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు అమాయకులు సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
తాజాగా లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన మరుపల్లి సాయిగౌడ్ ముద్ర లోన్ (Mudra Loan) పేరుతో సైబర్ మోసానికి గురయ్యాడు. ఎస్సై దీపక్ కుమార్ (SI Deepak Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. సాయాగౌడ్ మొబైల్ ఫోన్ లో ముద్ర లోన్ యాడ్ రావడంతో దానిపై క్లిక్ చేయగానే అతని ఫోన్ నెంబర్ కనిపించింది.
దానికి బాధితుడు ఫోన్ చేయగా మీకు రూ.15 లక్షల ముద్ర లోన్ మంజూరైందని.. దానికోసం మొదటి విడతగా రూ.6,500, తర్వాత రూ.24,000 చెల్లించాలని కోరగా అలాగే చెల్లించాడు. తర్వాత కూడా 49,000 చెల్లించాలని చెప్పడంతో మోసం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించినట్లు ఎస్సై పేర్కొన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని.. గుర్తు తెలియని లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దని సూచించారు.