Homeజిల్లాలునిజామాబాద్​Limbadri Gutta | జనసంద్రమైన నింబాచలం.. భక్తిశ్రద్ధలతో రథోత్సవం..

Limbadri Gutta | జనసంద్రమైన నింబాచలం.. భక్తిశ్రద్ధలతో రథోత్సవం..

లింబాద్రిగుట్ట భక్తజన సంద్రమైంది. లక్ష్మీనృసింహుడి రథోత్సవానికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో క్షేత్రం పులకించిపోయింది.

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: Limbadri Gutta | శ్రీమన్నింబాచాల క్షేత్రం జనసంద్రమైంది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో శ్రీ నింబాచల క్షేత్రం పులకించిపోయింది. భీమ్​గల్ శివారులోని లింబాద్రి గుట్టపై శ్రీ లక్ష్మీ నృసింహుని రథోత్సవం (Sri Lakshmi Narasimha Rathothsavam) కనుల పండువగా సాగింది.

కార్తీకమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కార్తీక పౌర్ణమి (Kartika Purnima) సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసు దేవాచార్యులు ఇతర అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి రథ యాత్ర నిర్వహించారు.

శ్రీమన్నారాయణుడిని ఆహ్వానించి షోడశోపచార పూజలు చేశారు. రథ ప్రథమ స్థలమందు గరుత్మంతుడికి ప్రాణప్రతిష్ఠ గావించారు. రథానికి జీవకళ చేకూర్చేందుకు తత్వన్యాసం చేశారు. రథచక్రాలలోకి ప్రతాపవంతుడైన వాయుపుత్రుడిని ఆహ్వానించే కార్యక్రమం భక్తితో నిర్వహించారు. రథాన్ని లాగేందుకు తక్షకుడిని, కర్కోటకుడిని ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ట చేశారు. రథ ప్రతిష్ట సంపూర్ణ ఫలం కోసం హోమం పూర్ణాహుతి (Purnaahuti) నిర్వహించి అగ్నిహోత్రానికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతులు, వేలమంది భక్తజనం మధ్య వారి గోవిందనామస్మరణాలు, డప్పు చప్పుళ్ల మధ్య రథోత్సవాన్ని ప్రారంభించారు. రథంపై ఆశీనులైన శ్రీ కేశవుని (శ్రీ లక్ష్మీ నృసింహుని) చూసిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.

Limbadri Gutta | పోటెత్తిన భక్తజనం

రథోత్సవాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు హాజరయ్యారు. వేకువజాము నుంచి పుష్కరిణి వీధుల నుంచి మెట్ల మార్గం గుండా గర్భాలయంలో స్వామి వారి వరకు రద్దీ కనిపించింది. జాతరను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి స్వర్ణాలంకరణ చేశారు. దేదీప్యమానమైన స్వామిని దర్శించుకుని భక్తులు తన్మయత్నం చెందారు.

Limbadri Gutta | బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

రథోత్సం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి (ACP Venkateswar Reddy) ఆదేశాల మేరకు సీఐ సత్యనారాయణ గౌడ్, ఎస్సై సందీప్ (SI Sandeep) ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. గర్భాలయంలోని మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెళ్లే భక్తుల క్రమబద్ధీకరణ నుంచి రథోత్సవం ముగిసే వరకు బందోబస్తును పకడ్బందీగా నిర్వహించారు.

Limbadri Gutta | రథోత్సవంలో ప్రముఖులు

లింబాద్రి క్షేత్రంపై బుధవారం నిర్వహించిన రథోత్సవంలో ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి (MLAs Paidi Rakesh Reddy), ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, ఏలేటి మల్లిఖార్జున్​ రెడ్డి, ప్రముఖ వైద్యులు మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Limbadri Gutta | స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు..

అక్షరటుడే, ఆర్మూర్: లింబాద్రి గుట్టపై లక్ష్మీనృసింహుడిని బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.