అక్షరటుడే, ఎల్లారెడ్డి : Farmers | కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) రైతులకు తీరని వేదన మిగిల్చాయి. ఎన్నో ఆశలతో వానాకాలం పంట సాగు చేసిన రైతులకు భారీ నష్టం మిగిలింది.
భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కష్టపడి సాగు చేసిన పంటలు కొట్టుకుపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. వర్షాలకు జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. కుంటలు చెరువులు తెగిపోయాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. పంట పొలాల్లో ఇసుక మేటలు.. బురద, రాళ్లు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా 76,984 ఎకరాల్లో పంట నష్టం (Crop damage) వాటిల్లినట్లు అధికారులు నివేదిక రూపొందించారు.
Farmers | పొలాల్లో ఇసుక, బురద
వరద ఉధృతికి చెరువులు, కుంటలు తెగిపోయాయి. వాగులు ఉధృతంగా పారాయి. దీంతో పలుచోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వ్యవసాయ భూముల్లో రాళ్లు, బురద పేరుకుపోయాయి. దీంతో ఆ భూములు సాగులోకి తీసుకురావడానికి రైతులు అనేక తిప్పలు పడాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 249 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 54,223 రైతులకు నష్టం వాటిలినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా వరి 44,077 ఎకరాలు, మొక్కజొన్న 13,097 ఎకరాలు, సోయా 9,102, పత్తి 9,782, పెసర 546, మినుము 257, చెరుకు 93 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనాలు రూపొందించారు.

Farmers | తెగిన చెరువులు..
జిల్లా వ్యాప్తంగా 40 వరకు చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయి. ఎల్లారెడ్డి (Yellareddy) మండలంలో తిమ్మాపూర్, అడివి లింగాల్, లక్ష్మాపూర్, వెలుట్ల, లింగంపేట్ మండలంలో బల్కంపేట్, లింగంపల్లి, శెట్టిపల్లి సంగారెడ్డి, కోమటిపల్లి చెరువులు తెగిపోయాయి. దీంతో నీరు పూర్తిగా ఖాళీ కావడంతో ఆ చెరువులు మైదానంలా మారాయి.
జిల్లావ్యాప్తంగా 60కి పైగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. మూడు రోజులుగా పలు రూట్లలో రాకపోకలు స్తంభించాయి. చాలా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్ అధికారులు సరి చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.