అక్షరటుడే, వెబ్డెస్క్: Rachakonda CP | రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. ఈ ఏడాది నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) సోమవారం విడుదల చేశారు.
హైదరాబాద్ నగరంలో రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate) కీలకం. శివారు ప్రాంతాలు దీని పరిధిలోనే ఉంటాయి. చాలా వరకు నేరాలు కమిషనరేట్ పరిధిలోనే చోటు చేసుకుంటాయి. గతేడాదితో పోలిస్తే 2025లో అన్ని రకాల నేరాలు పెరగడం గమనార్హం. 2024లో మొత్తం 28,626 కేసులు నమోదవ్వగా, 2025లో 33,040 కేసులు నమోదు అయ్యాయి.
Rachakonda CP | నేరాల వివరాలు
నగదు, నగల కోసం 2024లో ఐదు హత్యలు జరగ్గా.. ఈ ఏడాది మూడు జరిగాయి. మొత్తం కిడ్నాప్ కేసులు – 579, POCSO కేసులు – 1224, హత్యలు- 73 , అత్యాచారలు – 330 నమోదు అయ్యాయి. గత ఏడాదితో పోల్చితే మహిళలపై నేరాల సంఖ్య 4 శాతం పెరిగింది.ఈ ఏడాది రూ.20 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసుల్లో మొత్తం 668 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు.
Rachakonda CP | తగ్గిన చోరీలు
గతేడాదితో పోలీస్తే చోరీలు, దోపిడీలు తగ్గాయి. పోయిన సంవత్సరం 118 రాబరీ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 67 కేసులు ఫైల్ అయ్యాయి. తాళం పగులగొట్టి ఇళ్లలో చోరీలు ఈ ఏడాది 589, వాహనాల దొంగతనాలు 876, ఇతర చోరీలు 1,161 నమోదు అయ్యాయి. వరకట్న వేధింపులతో గతేడాది 18 మంది చనిపోగా ఈ సంవత్సరం 12మంది మృతి చెందారు. గృహ హింస కేసులు సైతం తగ్గాయి. గతేడాది 1,222 కేసులు నమోదు కాగా.. ఈ సంవత్సరం 782 కేసులు నమోదు అయ్యాయి.