అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Haryana | హర్యానా (Haryana)లోని గనౌర్ పట్టణంలో సోమవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. స్థానికంగా పేరుగాంచిన క్రికెటర్, కోచ్ రామ్‌కరణ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సబ్-డివిజనల్ ఆసుపత్రి (Sub-Divisional Hospital) సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల సమాచారం ప్రకారం, రామ్‌కరణ్ ఓ ఆసుపత్రి సమీపంలో ఉన్నప్పుడు ఒక వాహనంలో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రామ్‌కరణ్‌ను సహచరులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
Haryana | చూస్తుండగానే చంపేశారు..
ఈ ఘటనను అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా చూసినట్లు తెలుస్తోంది. మొదటి దశ దర్యాప్తులో రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కోడలు ప్రస్తుతం గనౌర్ మున్సిపల్ వార్డ్ నంబర్ 12 కౌన్సిలర్‌గా ఉన్నారు. మరోవైపు, నిందితుల్లో ఒకరిగా అనుమానిస్తున్న సునీల్ ‘లంబూ’ గతంలో మున్సిపల్ కౌన్సిల్ యాక్టింగ్ చైర్మన్‌గా పనిచేశారు. గత మున్సిపల్ ఎన్నికల (Muncipal Elections) తర్వాత నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ఘటనతో పట్టణంలో భయాందోళన వాతావరణం నెలకొంది. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. సోనేపట్ జిల్లా (Sonepat District) సీనియర్ పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని, ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలను సేకరిస్తున్నారు.
సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footage) ఆధారంగా దుండగుల గుర్తింపుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో, పట్టణంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హత్య వెనుక ఉన్న రాజకీయ కక్షలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
