అక్షరటుడే, వెబ్డెస్క్: YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu)పై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు. భూమండలం మీద ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరని ఎద్దేవా చేశారు.
జగన్ గురువారం మీడియాతో మాట్లాడారు. భూముల రీసర్వే (Land Resurvey) చేయాలన్న కనీస ఆలోచన కూడా ఎప్పుడైనా వచ్చిందా అని బాబును ప్రశ్నించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే రీ సర్వే అన్నారు. 2019 కంటే ముందు భూములు సర్వే చేసే టెక్నాలజీ లేదని చెప్పారు. భూములు రీ సర్వే చేయించాలని తన పాదయాత్రలో నిర్ణయించినట్లు జగన్ పేర్కొన్నారు. ఆ మేరకు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామన్నారు. రైతులకు, ప్రజలకు వివాదాలు లేనివిధంగా, పారదర్శకంగా భూములు సర్వే చేశామన్నారు.
YS Jagan | మహాయజ్ఞంలా..
ట్యాంపరింగ్ చేయలేని విధంగా భూ యజమానులకు, రైతులకు (Farmers) శాశ్వత పత్రాలు ఇచ్చామని జగన్ తెలిపారు. భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టామన్నారు. వందేళ్లక్రితం బ్రిటిషర్ల కాలంలో భూ సర్వే చేశారని, 2020 డిసెంబర్ 21న తాము రీ సర్వే ప్రారంభించామని వెల్లడించారు. యూరప్, అమెరికాలో వాడే టెక్నాలజీతో భూముల రీ సర్వే చేశామని చెప్పారు. గ్రామ సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్లు (Land Registrations) చేశామన్నారు. తాము చేసి సర్వేను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.