అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khammam | ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో చోటుచేసుకున్న దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
ప్రముఖ సీపీఎం నాయకుడు సామినేని రామారావును (Samineni Rama Rao) ముగ్గురు దుండగులు శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో గొంతుకోసి హత్య చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే రామారావుపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Khammam | పక్కా ప్లాన్ ప్రకారమే..
సామినేని రామారావు సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రైతు సమస్యలపై ఎప్పుడూ ముందుండే రామారావు పార్టీకి, ప్రజలకు అండగా నిలిచేవారు. ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆయన హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) స్పందించారు. “హింసాయుత రాజకీయాలకు తెలంగాణలో తావు లేదు. దోషులను వేటాడి చట్టం ముందుకు తీసుకువస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా పోలీసు అధికారులతో అత్యవసరంగా సమావేశమై, క్లూస్ టీం, సైబర్ టీం (Cyber Team), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దోషులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
అలాగే సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. “ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఖమ్మం పోలీసులు (Khammam Police) ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాత విభేదాలా, రాజకీయ కోణమా అనేదానిపై విచారణ కొనసాగుతోంది.

