అక్షరటుడే, వెబ్డెస్క్ : Police Transfers | హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) టాస్క్ఫోర్స్ పోలీసులకు షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నగరంలోని టాస్క్ఫోర్స్ విభాగంలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన వారిని తాజాగా సీపీ స్థానచలనం కలిగించారు. వీరిలో ఎస్సై నుంచి కానిస్టేబుల్ ర్యాంక్ సిబ్బంది ఉన్నారు. ఏళ్లుగా టాస్క్ఫోర్స్లో ఉంటున్న పలువురు అవీనితికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీపీ తాజాగా చర్యలు చేపట్టారు. 80 మంది సిబ్బందిన సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అవినీతి, క్రమశిక్షణారాహిత్యంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిర్యాదులపై విచారణల తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Police Transfers | ఆరోపణలు రావడంతో..
టాస్క్ఫోర్స్ (Task Force) కింద నగరంలోని ఏడు జోన్లలో పనిచేశారు. ఈ యూనిట్ నేరుగా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఇది వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు కృషి చేస్తుంది. ముఖ్యమైన, తీవ్రమైన కేసులను కూడా గుర్తిస్తుంది. నగరంలో అల్లర్ల సమయంలో ఇది అల్లర్ల నియంత్రణ దళంగా పనిచేస్తుంది. అయితే పలువురు అధికారులపై ఆరోపణలు రావడంతో సీపీ బదిలీ చేశారు.
Police Transfers | పోలీస్ వర్గాల్లో చర్చ
టాస్క్ఫోర్స్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బదిలీ గతంలో ఎప్పుడూ జరగలేదు. దీంతో పోలీస్ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పూర్తిగా పరిపాలనా ప్రాతిపదికన బదిలీలు నిర్వహించారని శాఖ ఉత్తర్వులో పేర్కొంది. ఫిర్యాదులు, విచారణలతోనే స్థాన చలనం కలిగించారని తెలుస్తోంది. టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్నప్పుడు అక్రమాలకు పాల్పడటం, లంచాలు తీసుకోవడం వంటి ఆరోపణలపై ఈ ఫిర్యాదులు వచ్చాయి.
Police Transfers | జోరుగా వసూళ్లు
దర్యాప్తు సమయంలో ఈ బృందాలలో పనిచేస్తున్న కొంతమంది ఇన్స్పెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. వారిపై విచారణలు కొనసాగుతున్నాయి. బదిలీ చేయబడిన వారిలో కొందరు బెట్టింగ్ నిర్వాహకులు, బెల్టు షాపులు, జూదం స్థావరాలు మరియు ఇతర వ్యవస్థీకృత నేర ముఠాల నుంచి డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ (Hyderabad)లో వ్యవస్థీకృత నేరాలను అరికట్టడంలో టాస్క్ఫోర్స్ పాత్ర కీలకం. దీంతో బదిలీలు ఒక ముఖ్యమైన అంతర్గత దశను సూచిస్తాయి. పూర్తిస్థాయి విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.