అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad CP | యువత రోజురోజుకి డ్రగ్స్ వినియోగానికి బానిస అవుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా గంజాయి వినియోగం పెరిగింది. కళాశాల స్థాయిలోనే కొందరు గంజాయికి బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇంతలా ప్రభావం చూపిస్తున్న గంజాయి ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కట్టడి వేసేలా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య (Nizamabad CP Sai Chaitanya) చర్యలు చేపట్టారు.
సీపీ సాయిచైతన్య గతంలో హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరోలో (Hyderabad Narcotics Bureau) పనిచేశారు. దీంతో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులు, కట్టడి చర్యలపై లోతైన అవగాహన ఉంది. ముఖ్యంగా కేసుల నమోదు, నిందితులను కట్టడి చేసేలా తీసుకోవాల్సిన వ్యూహాలు తెలుసు. దీంతో ఆయన నిజామాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన మొదటి నుంచి గంజాయి, అల్ప్రాజోలం తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్న వారిపై నిఘా పెట్టించారు. డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి చేసేలా అధికారులు, సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.
Nizamabad CP | ఆకట్టుకునే ప్రజంటేషన్..
తాజాగా నిజామాబాద్ కలెక్టరేట్‌లో (Nizamabad Collectorate) మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా కట్టడి చర్యలపై సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) పాటు సీపీ సాయిచైతన్య, వివిధ శాఖల అధికారులు పాల్గన్నారు. కాగా.. ఈ సందర్భంగా అందరినీ ఆకట్టుకునేలా సీపీ తన పవర్‌పాయింట్ పజంటేషన్ ఇచ్చారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే అక్రమార్కులపై పోలీసు, ఎక్సైజ్ శాఖల (police and excise department) సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. నిందితుల ఆస్తులను జప్తు చేయడం తదితర అంశాలపై కులంకుశంగా వివరించిన తీరు ఆయన అనుభవానికి అద్దం పట్టింది.
Nizamabad CP | సమన్వయంతో అడ్డుకట్ట..
జిల్లాలో గంజాయి, అల్ప్రాజోలం వినియోగం ఎక్కువగా జరుగుతోంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర (Maharashtra) నుంచి అల్ప్రాజోలం, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతోంది. పాత నేరస్థులే పదేపదే అక్రమ రవాణాకు పాల్పడి పోలీసులకు చిక్కుతున్నారు. ఇలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేసేలా సీపీ సాయిచైతన్య యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అందరూ పక్కాగా పనిచేస్తే జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాకు కొంతమేరైనా అడ్డుకట్ట పడనుంది.