అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CP Sajjanar | రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్జెండర్ల వేధింపులతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. పెళ్లి జరిగినా, గృహ ప్రవేశం, షాప్ ఓపెనింగ్ చేసినా వీరు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బులు అడిగి ఇవ్వకపోతే నానా హంగామా చేస్తారు. ఈ క్రమంలో ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ సీపీ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాన్స్జెండర్ల ఆగడాలు శృతి మించాయి. ఇటీవల గృహ ప్రవేశం చేసిన ఓ వ్యక్తి అడిగినంత డబ్బులు ఇవ్వలేదని వీరి గ్యాంగ్ వెళ్లి దాడి చేసింది. ఈ క్రమంలో నగర సీపీ సజ్జనార్ శుక్రవారం రాత్రి వారికి కౌన్సెలింగ్ (Counseling) ఇచ్చారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు.
CP Sajjanar | ఆధిపత్య పోరుతో..
అమీర్‌పేట (Ameerpet)లోని సెంటర్ పర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్ జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సీపీ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ట్రాన్స్జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదన్నారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమని ఆయన స్పష్టం చేశారు. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్ష తప్పదన్నారు. వీరి సంక్షేమం కోసం త్వరలోనే ప్రభుత్వం పాలసీ తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గౌరవప్రదంగా జీవించాలన్నారు.
CP Sajjanar | ప్రైడ్ ప్లేస్‌తో సమస్యల పరిష్కారం
ట్రాన్స్జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ (Pride Place) అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా (DGP Charu Sinha) తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా ఈ వింగ్‌ను ఆశ్రయించాలని సూచించారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ హుందాగా జీవించాలన్నారు. రాష్ట్రంలో 50 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ రాజేందర్ తెలిపారు.