అక్షరటుడే, వెబ్‌డెస్క్: Covid : ఆసియాలో మళ్లీ కొవిడ్ విజృంభన సూచనలు కనబడుతున్నాయి. హాంకాంగ్(Hong Kong), సింగపూర్(Singapore)లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ దేశాల అధికారులు అప్రమత్తం చేశారు. హాంకాంగ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఒక స్థానిక అధికారి హెచ్చరించారు.
ఇటీవల కొవిడ్ శాంపిల్స్‌లో అనేకం పాజిటివ్‌గా తేలాయని అధికారి చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం ఈ స్థాయిలో కొవిడ్ పాజిటివ్స్ రావడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. మే 3తో ముగిసిన వారంలో 31 కొవిడ్ మరణాలు నమోదు అయ్యాయని తెలిపారు. ఏడాది ఇదే గరిష్ఠ సంఖ్య అని చెప్పారు.
రెండేళ్ల కిందటి కొవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోల్చితే.. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరస్ లోడ్ పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.
సింగపూర్‌లోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సుమారు ఏడాది తర్వాత కొవిడ్ కేసుల సంఖ్యను అక్కడి ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. మే 3తో ముగిసిన వారంలో కేసుల సంఖ్య 14,200 గా ఉంది. ఈ సంఖ్య అంతకుముందు వారంతో పోల్చితే 28 శాతం ఎక్కువని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య సైతం 30 శాతం పెరిగిందన్నారు.
జనాభాలో ఇమ్యూనిటీ తగ్గుతుండటం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుత వేరియంట్ల వ్యాప్తి సామర్థ్యం గతంలో కంటే తక్కువగానే ఉందని చెబుతున్నారు. వ్యాధి తీవ్రత మాత్రం మునుపటి లాగానే ఉందట.
హాంకాంగ్, సింగపూర్‌తో పాటు ఆసియాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కొవిడ్ కేసుల్లో పెరుగదల ఉంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. టీకాలు వేసుకోవాలని, కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న వారు బూస్టర్ డోసులు వేసుకోవాలంటున్నారు.
సాధారణంగా చలికాలంలో శ్వాసకోస సంబంధిత సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, కొవిడ్ మాత్రం ఎండాకాలంలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.