అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | లంచం తీసుకుంటూ దొరికిన ఓ తహశీల్దార్ (Tahsildar)కు ఏసీబీ (ACB) ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
నల్గొండ (Nalgonda) జిల్లా తిరుమలగిరి తహశీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలో శ్రీనివాస్‌రాజు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ శ్రీనివాస్‌రాజు వ్యవసాయ భూములను మ్యుటేషన్ చేయడానికి, పట్టాదార్ పాస్ పుస్తకాలు (Patta passbooks) జారీ చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను 2011 డిసెంబర్ 30న అరెస్ట్ చేశారు.
ACB Case | కఠిన కారాగార శిక్ష
లంచం తీసుకుంటూ దొరికిన తహశీల్దార్‌పై ఏసీబీ అధికారులు కోర్టులో సాక్ష్యాలు సమర్పించారు. ఈ కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు ఒకటో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి తహశీల్దార్‌ను దోషిగా నిర్ధారించారు. ఆయనకు ఏడాది పాటు కఠినమైన జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించారు. జరిమానా మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఒక నెల పాటు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించారు.
ACB Case | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.