అక్షరటుడే, వెబ్‌డెస్క్: Court Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా దుండగులు కోర్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court), కరీంనగర్ జిల్లా కోర్టు (Karimnagar District Court)లకు బెదిరింపులు వచ్చాయి. అలాగే ఏపీలోని రాజమండ్రి జిల్లా కోర్టులో సైతం బాంబు పెట్టినట్లు ఫోన్ రావడతో అధికారులు, పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Court Bomb Threats | పోలీసుల తనిఖీలు
కరీంనగర్ కోర్టులో 12 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు మెయిల్ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపించారు. దీంతో పోలీసులు కోర్టుకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. న్యాయమూర్తులు, సిబ్బంది, న్యాయవాదులను బయటకు పంపించారు. అనంతరం బాంబు స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టుకు సైతం బెదిరింపులు రావడంతో బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. రాజమండ్రి జిల్లా కోర్టుకు సైతం బెదిరింపులు రావడంతో న్యాయమూర్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు కోర్టు ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపులతో న్యాయమూర్తులు, అడ్వకేట్లు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంతో బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్‌పోర్టులు (Airports), ఫ్లైట్లు, రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు స్కూళ్లు, కోర్టులకు సైతం బెదిరింపులు వస్తున్నాయి. ప్రధాన నగరాలకే గతంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు జిల్లా కోర్టులను సైతం దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. అయితే బెదిరింపులలో చాలా వరకు నకిలీవి ఉంటున్నాయి. దీంతో అధికారులు, ప్రజలు, పోలీసుల సమయం వృథా అవుతోంది.