అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asifabad | పశువులను మేతకు తీసుకు వెళ్లిన ఆ దంపతులు తిరిగి రాలేదు. పశువులు ఇళ్లు చేరినా కాపరులు మాత్రం జాడ లేకుండా పోయారు.
పశువుల కాపరులు కనిపించకుండా పోవడంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. అటవీ ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్(Asifabad) జిల్లా సిర్పూర్ టీ అభయారణ్యంలో చోటు చేసుకుంది. పశువులను మేతకు తీసుకెళ్లిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
Asifabad | పులి దాడి చేసిందా..
సిర్పూర్ టీ మండలం అచ్చెల్లి గ్రామానికి(Atchelli Village) చెందిన దూలం శేఖర్ (45), దూలం సుశీల (40) భార్యా భర్తలు. ఈ దంపతులను పశువులను మేపుతూ జీవనం సాగిస్తారు. బుధవారం ఉదయం పశువులను తీసుకొని అటవీ ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రం పశువులు గ్రామానికి వచ్చిన వీరు మాత్రం రాలేదు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు గురువారం అడవిలో వారి కోసం గాలించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.
ఇద్దరి ఒంటిపై రక్తపు మరకలు, అటవీ జంతువులు దాడి చేసినట్టుగా గుర్తులు ఉన్నాయి. దీంతో పులి దాడి చేసిందా.. లేక ఇతర జంతువులు ఏవైనా దాడి చేశాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రాంతంలో పులి, ఎలుగు బంట్ల సంచారం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. కాగా ఫారెస్ట్ అధికారులు(Forest Officers) రక్త నమునాలను ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే ఈ ఇద్దరి మృతికి కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు.