అక్షరటుడే, కామారెడ్డి : kamareddy | గంజాయి సేవించే అలవాటు ఉన్న 31 మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్ రావు (District Excise Superintendent Hanmanth Rao) తెలిపారు.
ఈ నెల 10న గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిని విచారించగా.. అతని వద్ద 31 మంది గంజాయి తీసుకుంటున్నట్లు తేలింది. దీంతో మూడు రోజులుగా సదరు యువకులను, వారి తల్లిదండ్రులను ఎక్సైజ్ కార్యాలయానికి (excise office) పిలిపించి సైకియాట్రిస్ట్ రమణ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హన్మంత్ రావు మాట్లాడుతూ.. 31 మందిలో కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి (Chinnamalla Reddy village) చెందిన 14 మంది, కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన 8 మంది, రాజంపేటకు చెందిన ఆరుగురు, రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నారని తెలిపారు. గంజాయితో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు సంపత్ కృష్ణ, సుందర్ కృష్ణ, ఎస్సైలు విక్రమ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.