అక్షరటుడే, హైదరాబాద్: council elections | తెలంగాణ రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పక్కాగా 80 శాతం సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. అదే జోష్‌లో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది.
అంతా ఓసారి సరిచూసుకుని బడ్జెట్ సమావేశాలకు ముందే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన దాని ప్రకారం చూస్తే.. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక.. రైతు భరోసా నిధులను కర్షకుల ఖాతాల్లో జమ చేసి, ఆ వెంటనే పరిషత్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మార్చి మొదటి వారంలో పరిషత్ ఎన్నికలను రెండు నిర్వహించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టాక.. జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలే రావడం శుభపరిణామంగా భావిస్తోంది. పనిలో పనిగా పరిషత్ ఎన్నికలను కూడా ముగించాలని చూస్తోంది.
council elections | వచ్చే నెలలోనే..
కేంద్రం నుంచి పరిషత్‌లకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ. 450 కోట్లు రావాల్సి ఉంది. కాగా, పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం వాటిని విడుదల చేయడం లేదు. ఒకవేళ మార్చిలోగా పాలక వర్గాలు ఏర్పడకుంటే ఆ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎన్నికలను నిర్వహించి, పరిషత్‌లో పాలకవర్గాలు ఏర్పాటు చేసి.. ఆ వెంటనే వివరాలను కేంద్రానికి పంపించి నిధులు విడుదల చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
council elections | మొదటి వారంలోనే..
పదో తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఉండనున్నాయి. అంటే అప్పుడు ప్రభుత్వ టీచర్లు బిజీగా ఉంటారు. వారికి ఎన్నికల విధులు కేటాయించలేని పరిస్థితి ఉంటుంది. అంతలోపే అంటే మార్చి మొదటి వారంలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించి, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలనేది కూడా సర్కారు ఆలోచనగా తెలుస్తోంది.