అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cough Syrup | అనేక మంది చిన్నారుల మరణానికి కారణమైన దగ్గు మందు తయారీ కంపెనీతో సంబంధమున్న సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) సోమవారం పలు చోట్ల దాడులు చేసింది. కోల్డ్ రీఫ్ అనే కఫ్ సిరప్ తాగడంతో మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో దాదాపు 40 మందికి పైగా పిల్లలు మృతి చెందారు.
దీంతో ఆ దగ్గుమందును నిషేధించడమే కాకుండా దాన్ని తయారీ చేస్తున్న సంస్థపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లల మరణానికి కారణమైన కోల్డ్ రిఫ్ సిరప్(Cold Riff Syrup) తయారీదారు అయిన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్‌తో సంబంధం ఉన్న ఏడు ప్రదేశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టింది.
Cough Syrup | ఏడుచోట్ల తనిఖీలు..
దగ్గుమందు(Cough Syrup) వికటించి చిన్నారులు మృతి చెందిన కేసుకు సంబంధించి శ్రీసన్ ఫార్మా యజమాని జి రంగనాథన్‌ను అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈడీ దాడులు చోటు చేసుకున్నాయి. కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్ కేసులో PMLA కింద శ్రీసన్ ఫార్మా(Srisan Pharma)తో సంబంధం ఉన్న చెన్నైలోని ఏడు ప్రాంగణాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే, తమిళనాడు డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నతాధికారుల నివాసాలపైనా దాడులు చేసింది.
Cough Syrup | అనేక లోపాలు..
శ్రేసన్ ఫార్మాతో పాటు తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (TNFDA) ఉన్నతాధికారుల నివాసాలపై కూడా ఈడీ దాడులు చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇటీవల జరిపిన తనిఖీలో TNFDA లోపాలు బయటపడిన తర్వాత ఈడీ సోదాలు చేపట్టింది. శ్రేసన్ ఫార్మా 2011లో TNFDA ద్వారా లైసెన్స్ పొందింది, కానీ మౌలిక సదుపాయాలు బలహీనంగా ఉన్నప్పటికీ అది ఒక దశాబ్దానికి పైగా దాని కార్యకలాపాలను తనిఖీ లేకుండా కొనసాగించింది. “శ్రేసన్ ఫార్మాలో జరిగిన ఏ ఆడిట్‌లోనూ CDSCO పాల్గొనలేదు. CDSCO ప్రమేయం లేకపోవడం మరియు రాష్ట్ర FDA ఈ కంపెనీ గురించి CDSCOకి ఏ విధంగానూ తెలియజేయకపోవడంతో, ఈ కంపెనీ ఏ CDSCO డేటాబేస్‌లలో భాగం కాదు” అని ఈడీ తెలిపింది
Cough Syrup | కోల్డ్‌రిఫ్ పై నిషేధం
మధ్యప్రదేశ్, రాజస్థాన్(Rajasthan)లలో అనేక మంది చిన్నారులు మరణించడంతో కోల్డ్‌రిఫ్ వాడకంపై ఆందోళనలు తలెత్తాయి. అప్పటి నుండి, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి అనేక రాష్ట్రాలు దగ్గు సిరప్‌ను నిషేధించాయి. కోల్డ్‌రిఫ్ తయారీదారుల యూనిట్ ఉన్న తమిళనాడులో, దగ్గు సిరప్ నమూనాలు ‘కల్తీ’గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది, అయితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.