అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cotton Harvesting Machine | పత్తి రైతులకు తిప్పలు తప్పనున్నాయి. పత్తి తీసే యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) ఆదివారం ఆవిష్కరించారు.
భోపాల్‌లోని ICAR – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (CIAE) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి కోత యంత్రాన్ని కేంద్ర మంత్రి జాతికి అంకితం ఇచ్చారు. ఇప్పటి వరకు కూలీలతో పత్తి తీయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఆయన తెలిపారు. దీనికి సమయం, శ్రమ, ఖర్చులు ఎక్కువ అయ్యేవన్నారు. పత్తి కోతను సులభతరం చేయడానికి రైతులు చాలా కాలంగా యంత్రం కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఈ డిమాండ్ ఇప్పుడు నెరవేరిందన్నారు.
Cotton Harvesting Machine | సమయం ఆదా
యంత్రాన్ని ఉపయోగించి పత్తి కోత ప్రక్రియను ఆయన పరిశీలించారు. సాంకేతికత సమయాన్ని ఆదా చేస్తుంది, ఖర్చులను తగ్గిస్తుందన్నారు. దీంతో పత్తి రైతులకు (Cotton Farmers) మేలు జరుగుతుందని వ్యవసాయ మంత్రి చెప్పారు. ఈ యంత్రం త్వరలో రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు. అధిక దిగుబడితో కొత్త వ్యాధి నిరోధక పత్తి రకాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. మహాశివరాత్రి (Mahashivratri) శుభ సందర్భంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి కోత యంత్రాన్ని రైతులకు అంకితం చేశామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణలో సైతం రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేస్తారు. పత్తి తీయడానికే రైతులు అధికంగా ఖర్చు చేస్తారు. కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు వెచ్చిస్తారు. దీంతో సమయం ఎక్కువ కావడంతో పాటు ఖర్చు అధికం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో యంత్రం ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూలీలతో మూడు సార్లు రైతులు పత్తి తీయిస్తారు. యంత్రంతో అలా సాధ్యం అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.