అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IT Commissioner Case | ఆయన ఓ ఐఆర్ఎస్ అధికారి(IRS officer).. ఆదర్శంగా విధులు నిర్వహించాల్సిన ఆయన అడ్డదారులు తొక్కాడు. ఆదాయ పన్ను కమిషనర్ విధులు నిర్వహిస్తూ దేశ ఆదాయాన్ని పెంచాల్సిన ఆ అధికారి అక్రమార్జనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కీలక స్థానంలో ఉన్న ఆయన లంచగొండిగా మారి భారీ స్థాయిలో అవినీతి చేశాడు. అంతేగాకుండా లంచం తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించాడు. ఇటీవల రూ.70 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన హైదరాబాద్ ఆదాయపు పన్ను కమిషనర్(Hyderabad Income Tax Commissioner) జీవన్‌లాల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
IT Commissioner Case | అసలు ఏం జరిగిందంటే..
జీవన్‌లాల్(Jeevan Lal) హైదరాబాద్‌లో ఆదాయ పన్ను కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ట్యాక్సేషన్ ఫైల్ పెండింగ్‌ను క్లియర్ చేసేందుకు ఆయన రూ.1.20 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా మధ్యవర్తుల ద్వారా రూ.15 లక్షలు జీవన్‌లాల్ గతంలోనే తీసుకున్నాడు. మరో రూ.70 లక్షలు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారం మేరకు శుక్రవారం జీవన్‌లాల్‌ను సీబీఐ అధికారులు(CBI Officers) అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీ, తెలంగాణలోని 18 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ కేసు విచారణలో జీవన్‌లాల్ అవినీతిని చూసి సీబీఐ అధికారులే షాకయ్యారు. ఈ కేసులో 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. లంచం ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చడం గమనార్హం.
IT Commissioner Case | బినామీల పేరిట రిజిస్ట్రేషన్
జీవన్‌లాల్(Jeevan Lal) పెద్ద పెద్ద కంపెనీల నుంచి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ముంబయికి చెందిన ఓ కంపెనీ నుంచి ఏకంగా రూ.2.5కోట్ల విలువైన ప్లాట్‌ను లంచంగా తీసుకున్నట్లు సమాచారం. దానిని ఖమ్మం జిల్లాకు చెందిన బినామీ దండెల్ వెంకటేశ్వరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ముంబయిలోని మరో రెండు సంస్థల నుంచి రూ.35 లక్షలు లంచం తీసుకున్నట్లు సమాచారం. ఆయా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడానికి జీవన్‌లాల్ భారీగా లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
