అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మున్సిపాలిటీలో (Armoor Municipality) అవినీతి రాజ్యమేలుతోంది. ఏ చిన్న పని కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లినా చేతులు తడపందే పని జరగడం లేదు. కిందిస్థాయి అధికారి మొదలుకొని పైస్థాయి అధికారి వరకు తల ఇంత రేటును ఫిక్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ డబ్బు ముట్టితేనే ఫైల్ కదులుతుంది. డబ్బులు ఇవ్వకపోతే ఏవేవో కారణాలను చూపుతూ ఫైల్‌ను తొక్కి పెట్టుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు (Municipal Commissioner Raju) ఇటీవల ఓ ఇంటి అనుమతి విషయంలో రూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.
ఆర్మూర్ మున్సిపాలిటీ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ముఖ్యంగా రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్లతోపాటు జనన, మరణ, సానిటరీ విభాగాల్లో అవినీతి తారాస్థాయికి చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పట్టణ అభివృద్ధికి రూ.18 కోట్ల నిధుల మంజూరు కాగా తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు కేటాయించినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మొత్తంలో డబ్బులు అధికారులకు చేరినట్లు తెలిసింది.
Armoor | అధికారుల్లో భయం
ఆర్మూర్ మున్సిపల్ అధికారుల్లో భయం చుట్టుకుంది. రెండు రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ రాజు ఏసీబీ అధికారులకు (ACB officials) పట్టుబడటంతో కార్యాలయంలో ఒకసారిగా అలజడి నెలకొంది. నాటి నుంచి మున్సిపల్ కార్యాలయంలోని పలు సెక్షన్లకు సంబంధించిన ప్రధానాధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఆఫీసుకు దూరంగా ఉన్నారు. మరికొన్ని సెక్షన్లో ఉన్న అధికారులు కార్యాలయానికి తూతు మంత్రoగా వచ్చి వెళ్లిపోతున్నారు. కమిషనర్ ఏసీబీకి చిక్కిన నాటి నుంచి కార్యాలయంలో నిశబ్దం నెలకొంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు (Anti-Corruption Department officials) లోతైన విచారణ జరిపితే మరికొందరు అధికారుల చిట్టాలు బయటపడే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Armoor | మధ్యవర్తులతో..
ఆర్మూర్ మున్సిపాలిటీలో మధ్యవర్తుల హవా జోరుగా సాగుతోంది. కార్యాలయంలోని ఆయా శాఖల అధికారులను కొందరు మచ్చిక చేసుకొని వారికి మామూళ్లు ఇస్తూ పనులు చేయించుకుంటున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు కార్యాలయంలోని అవుట్ ర్సింగ్ సిబ్బందిని ఒకరిద్దరూ మధ్యవర్తులుగా చేసుకొని ఈ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. ప్రతిరోజు లంచాలు తీసుకుంటూ.. ఆఫీస్ ముగిసిన తర్వాత ఎవరికి రావాల్సిన వాటా వారు పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.