అక్షరటుడే, వెబ్‌డెస్క్: Corrupt Inspector | కామారెడ్డి జిల్లాలో ఓ ఇన్స్పెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ప్రత్యేకించి సొంత శాఖలోనే సీఐ వ్యవహారశైలిపై సర్వత్రా చర్చకు దారి తీయడం ఆందోళనకరం.
కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్న ఓ వలయానికి ఇన్స్పెక్టర్గా ఉన్న పోలీసు అధికారి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ సంపాదనకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రతి కేసులోనూ రూ.లక్షల్లో గుంజుతున్నట్లు తెలుస్తోంది.
సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో వచ్చే ప్రతి ఫిర్యాదు, నమోదయ్యే ప్రతి కేసు నుంచి పెద్ద మొత్తంలో చేయి తడపనిదే అడుగు ముందుకు పడనీయడం లేదు అంటే అతిశయోక్తి కాదు.
Corrupt Inspector | మచ్చుకు కొన్ని పరిశీలిస్తే..
గతంలో సర్కిల్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుల నుంచే కాకుండా.. ఫిర్యాదుదారుల నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.
ఇటీవల నమోదైన ఓ కేసులో రైస్‌మిల్ వ్యాపారి నుంచి రూ. 2 లక్షలను ముక్కు పిండి మరీ వసూలు చేసినట్లు ప్రచారంలో ఉంది.
సదరు అధికారి తీరుతో సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న స్టేషన్ల ఎస్సైలు విసిగి వేసారి పోయినట్లు సమాచారం. ఈ విషయమై ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నట్లు సమాచారం.
Corrupt Inspector | ఫామ్‌హౌస్ కేంద్రంగా..
సదరు ఇన్స్పెక్టర్కు 44వ నంబరు జాతీయ రహదారిపై ఓ ఫామ్‌హౌస్ ఉన్నట్లు సమాచారం. ఇక్కడే అన్ని రకాల సెటిల్మెంట్లు నిర్వహిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
ఈ ఫామ్‌హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు స్థానికంగా కోడై కూస్తోంది. ఈ సదరు ఫామ్‌హౌస్‌కు మహిళలు వచ్చి వెళ్తున్నట్లు సమాచారం.
ఓ బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి.. మరోవైపు ఫామ్‌హౌస్‌లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అందరినీ ప్రసన్నం చేసుకునే సదరు ఇన్స్పెక్టర్ ఎక్కడ పనిచేసినా.. వివాదాలకు కేంద్ర బిందువే. తాజాగా పనిచేస్తున్న చోటులో కూడా ఇదే వివాదాల పరంపర కొనసాగుతోంది.
తనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కామారెడ్డికి చెందిన మైనార్టీ ముఖ్యనేత సోదరుడిని ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం.
అలాగే ఇది వరకు ఎస్బీలో పని చేసి వెళ్లిన ఓ అధికారికి కూడా పదే పదే విందులు ఇవ్వడం.. రాచ మర్యాదలు చేసి పంపడం.. వంటివి చేస్తున్నట్లు పోలీసు వర్గాల్లో కోడై కూస్తోంది.
చిన్నపాటి నిర్లక్ష్యానికే కానిస్టేబుళ్లు, సిబ్బందిపై కొరఢా ఝలిపిస్తున్న జిల్లాస్థాయి అధికారులు.. ఈ అవినీతి అధికారి పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెలువడుతున్నాయి.
ఇప్పటికైనా సదరు ఇన్స్పెక్టర్ అక్రమాలపై లోతుగా విచారణ చేపట్టి.. ఆధారాలతో సహా బయటపెట్టి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
