అక్షరటుడే, నిజామాబాద్: Nizmabad city | నిజామాబాద్ నగరంలో అక్రమ బిల్డింగ్ నిర్మాణ పనులపై (illegal building construction work) కార్పొరేషన్ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. సదరు బిల్డింగ్‌ను పరిశీలించిన అధికారులు తక్షణమే పనులు నిలిపివేయాలని యజమానికి సూచించారు.
అలాగే ఏవైనా అనుమతి పత్రాలు కలిగి ఉంటే నిర్ణీత గడువులోపు సమర్పించాలని చెప్పినట్లు సమాచారం. వర్ని రోడ్డులోని ప్రధాన రహదారి వెంబడి ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఓ బీజేపీ నాయకుడు ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ భవన నిర్మాణం పూర్తి చేశాడు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం ‘అక్షరటుడే’లో ‘అనుమతుల్లేకుండా భవన నిర్మాణం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు (Town Planning officials) తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా మంగళవారం భవన నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అయితే నగర పాలక సంస్థ నుంచి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అధికారులు తేల్చి చెప్పారు.
Nizmabad city | సహకరించిందెవరు..
సదరు అక్రమ బిల్డింగ్ నిర్మాణం కోసం గతంలో పని చేసిన ఓ అధికారి అన్నీ తానై అండదండలు అందించినట్లు సమాచారం. నగరం నడిబొడ్డున ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీర్ అంతా తానే చూసుకుంటానని.. అనుమతులు సైతం ఇప్పిస్తానని, దస్త్రాన్ని సిద్ధం చేసి నగర పాలక సంస్థకు సమర్పించాడు. కాగా.. సెల్లార్‌తో పాటు ఐదంతస్తులతో కూడిన ఈ భవనం సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండానే పూర్తి చేశారు. దీంతో ఇటీవల కొత్తగా వచ్చిన అధికారులు సదరు బిల్డింగ్‌కు అనుమతులను నిరాకరించినట్లు సమాచారం. కాగా.. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే సామాన్యులపై కొరడా ఝులిపించే నగర పాలక సంస్థ అధికారులు (municipal corporation officials) సదరు బీజేపీ నాయకుడి బిల్డింగ్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరో వైపు నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నా కమిషనర్ దిలీప్ కుమార్ మాత్రం మౌనం వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.