Covid
Covid | తెలుగు రాష్ట్రాల‌లోను కరోనా క‌ల‌క‌లం..కర్నూల్ జిల్లాలో మరో ఇద్దరికి కోవిడ్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Covid | కోవిడ్‌-19 (Covid-19) మరో సారి గుబులు పుట్టిస్తోంది. మళ్లీ దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్లు, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. తెలుగు రాష్ట్రాల‌లోనూ క‌రోనా(Corona Virus) క‌ల‌కలం రేపుతోంది. వరంగల్‌(Warangal) ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

Covid | క‌రోనా టెర్ర‌ర్..

అలాగే ఎంజీఎం ఆస్పత్రి (MGM Hospital) పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్‌ కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై వరంగల్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.సాంబశివరావు స్పందించారు. నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు. కరోనా పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌(Covid positive) నిర్ధారణ అయింది.

కర్నూలు జీజీహెచ్‌కు GGH చెందిన ఓ ప్రొఫెసర్‌కు పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్‌ నిర్ధారణ అయింది. నగరంలోని వెంకటరమణకాలనీకి చెందిన ప్రొఫెసర్‌ హోం ఐసోలేషన్‌(Home isolation)లో చికిత్స పొందుతున్నారు. అలాగే మంత్రాలయం మండలం పరమాన్‌దొడ్డి తండాకు చెందిన 25 ఏళ్ల మహిళ అనారోగ్యంతో వారం రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరింది. ఆమెకు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటి 4026కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు. మహారాష్ట్రలో రెండు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో మరణం నమోదు అయ్యింది. యాక్టివ్ కేసుల్లో సగానికిపైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోనే ఉన్నాయి