అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Covid | కరోనా(Corona cases india) మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. చాలా రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తవుతున్నాయి. పడకలు, ఆక్సిజన్ నిల్వలు, వ్యాక్సిన్ల లభ్యతపై దృష్టి సారించాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన అవసరంలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇవి చాలా తేలికపాటి ఇన్ఫెక్షన్లు, వీటిని నియంత్రించడం సులువు అని పేర్కొంటున్నారు. అదే సమయంలో పరిస్థితి మరింత దిగజారితే ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల లభ్యతను నిర్ధారించడానికి అనేక రాష్ట్రాల అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
Covid | 257 యాక్టివ్ కేసులు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Health Ministry) ప్రకారం మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ COVID-19 కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు తేలికపాటివి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.అయితే, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలతో పాటు తాజాగా కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి.
కేరళలో 69 కేసులు, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34, కర్ణాటకలో 8, గుజరాత్‌లో 6, ఢిల్లీలో 3 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఢిల్లీతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజలకు అడ్వైజరీ జారీ చేశాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భయాందోళనలకు గురికాకుండా శుభ్రత పాటించాలని సలహాలు జారీ చేశాయి. అనేక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయనే నివేదికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ(Punya Salila Srivastava) పరిస్థితిని సమీక్షించారు.COVID-19 ఇప్పుడు ఇతర వైరల్ వ్యాధుల మాదిరిగానే చికిత్స లభిస్తున్నపటికీ.. రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలను పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.