అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Corona Virus | ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ (corona virus) మళ్లీ జడలు విప్పుతోంది. కొద్దికాలం స్తబ్ధుగా ఉన్న కోవిడ్-19 (Covid-19) క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండగా, తాజాగా ఇండియాలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) వైరస్ బయటపడగా, తాజాగా తెలంగాణలోనూ కోవిడ్ కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఒక డాక్టర్‌కు కరోనా పాజిటివ్ (corona positive) నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Corona Virus | అడ్వైజరీ జారీ..
2019లో వెలుగు చూసిన కరోనా వైరస్ (corona virus) ప్రపంచాన్ని స్తంభింపజేసింది. మన దేశంలోనూ కొన్ని నెలల పాటు లాక్‌డౌన్ (lockdown) విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో మొదటి సారిగా 2020 మార్చి 2న తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి (Hyderabad) వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని నిర్ధారణ అయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు (corona virus cases) లక్షల్లో నమోదు కావడంతో రెండు సార్లు లాక్ డౌన్ విధించారు. దీంతో మొత్తం జనజీవనం స్థంభంచిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా (America) కరోనాతో కకావికలమైంది. ఎటు చూసినా శవాల కుప్పలు దర్శనమిచ్చాయి. అయితే, క్రమంగా వైరస్ బలహీనపడడం, వ్యాక్సిన్లు రావడంతో కరోనా పీడ విరగడైందని అంతా భావించారు. ఆ తర్వాత జన జీవనం సాధారణ స్థితికి వచ్చింది. అయితే, ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న కరోనా మళ్లీ కలకలం రేపుతోంది.
Corona Virus | ఇండియాలో పెరుగుతున్న కేసులు..
గత కొంతకాలంగా సింగపూర్, మలేషియా (Singapore and Malaysia) లాంటి దేశాల్లో కోవిడ్ వ్యాప్తి పెరిగింది. ఇదే క్రమంలో ఇండియాలోనూ (India) కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం 80 వరకు యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ (Union Health Ministry) వెల్లడించింది. గురువారం ఏపీలో ఓ కేసు వెలుగు చూడగా, శుక్రవారం హైదరాబాద్‌లోనూ మరో కేసు నమోదైంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు అడ్వైజరీ జారీ చేశాయి. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, దూరం పాటించాలని సూచించాయి. అలాగే రద్దీ ప్రాంతాలకు వెళ్లే సమయంలోమాస్క్ వినియోగించాలని కోరాయి.