అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR Comments | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి కూడా తీసుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పోచారం ఓ సారి వ్యవసాయ శాఖ మంత్రిగా, మరోసారి స్పీకర్‌గా పనిచేశారు. అయితే ఆయన పార్టీ మారడంపై ఇటీవల కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
KTR Comments | సిగ్గు లేకుండా..
యాదాద్రి భువనగిరి జిల్లాలో (Yadadri Bhuvanagiri district) బీఆర్ఎస్ సర్పంచులతో కేటీఆర్ ఇటీవల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరిపై విమర్శలు చేశారు. 75 ఏళ్ల పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏ రోగం, సిగ్గు లేకుండా కాంగ్రెస్‌లో చేరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం సంపాదించుకున్న పేరును నాశనం చేసుకున్నారని విమర్శించారు. అన్ని పదవులు అనుభవించిన పోచారం పార్టీ ఎందుకు మారారో అర్థం కావడం లేదన్నారు. “నీకు ఎం తక్కువ చేశాం. ఇంతకన్నా చచ్చింది మేలు కదా”అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి వయసు ఉన్న పోచారంపై అలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి మాట్లాడితే విరుచుకుపడే కేటీఆర్ పోచారం గురించి మాట్లాడటం సరికాదు అంటున్నారు.
KTR Comments | అప్పుడు కొనలేదా..
బీఆర్ఎస్ తొలిసారి గెలిచినప్పుడు టీడీపీ నుంచి గెలిచిన వారిని చేర్చుకున్నారు. అప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ 63 సీట్లు మాత్రమే గెలవడంతో ఇతర పార్టీ నాయకులను చేర్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం సైతం పలువురు కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మారిన పలువురికి కేసీఆర్ మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఆ రోజు ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్‌కు ఈ రోజు వాటి గురించి మాట్లాడే అర్హత లేదని నెటిజన్లు అంటున్నారు. వయసులో పెద్దవారైన పోచారంను కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. తమ హయాంలో ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.