అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై (Speaker Gaddam Prasad Kumar) బీఆర్ఎస్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఆయన పట్టించుకోలేదని సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ వేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఈ మేరకు సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లో అనర్హతన పిటిషన్లపై విచారణ తీసుకోవాలని జులై 31న తీర్పు చెప్పింది.
Supreme Court | బీఆర్ఎస్ పిటిషిన్
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు అక్టోబర్ 31తో ముగిసింది. అయినా అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ ఆయనపై కోర్టు ధిక్కార పిటిషన్ (contempt of court petition) దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నా చర్యలు తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను వచ్చే సోమవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి ధర్మాసనం తెలిపింది.
Supreme Court | కొనసాగుతున్న ఎమ్మెల్యేల విచారణ
సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించారు. నలుగురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్ను ఆయన గతంలో నమోదు చేశారు. మరో నలుగురి ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ సాగుతోంది. అయితే విచారణ పూర్తికాకపోవడంతో మరింత గడువు కావాలని ఇప్పటికే సుప్రీంలో స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ విచారణకు రాకముందే బీఆర్ఎస్ కోర్టు (BRS court) ధిక్కార పిటిషన్ ఫైల్ చేయడం గమనార్హం.
