అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Consumer Forum | వినియోగదారుల ఫోరం అమెజాన్ (Amazon)కు షాక్ ఇచ్చింది. ఓ వినియోగదారుడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సంస్థపై నాన్‌బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) జారీ చేసింది.
ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మహా నగరాల నుంచి మొదలుకొని మారుమూల ప్రాంతాల వరకు ప్రజలు ఈ కామర్స్ సైట్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే పలు సందర్భాల్లో బుక్ చేసిన వస్తువులు కాకుండా వేరేవి వస్తుండటంతో ప్రజలు నష్టపోతున్నారు. ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Consumer Forum | రూ.80 వేలు పెట్టి ఆర్డర్ పెడితే..
కర్నూల్ (Kurnool) జిల్లాకు చెందిన వీరేష్ అనే వ్యక్తి అమెజాన్‌లో రూ.80 వేలు పెట్టి ఐఫోన్ 15ప్లస్ ఆర్డర్ పెట్టాడు. అయితే అతడికి ఐఫోన్‌కు బదులుగా ఐక్యూ ఫోన్ వచ్చింది. దీనిపై బాధితుడు అమెజాన్ కస్టమర్ కేర్ సెంటర్‌తో మాట్లాడాడు. అక్కడ సరైన స్పందన లభించకపోవడంతో కర్నూల్ జిల్లా కన్స్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన ఫోరం బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయాలని, లేదంటే.. రూ.80 వేలు రిఫండ్ చేయడంతోపాటు మరో రూ.25 వేలు అదనంగా చెల్లించాలని ఆదేశించింది.
Consumer Forum | పట్టించుకోకపోవడంతో..
వినియోగదారుల ఫోరం ఆదేశాలను అమెజాన్ సంస్థ పట్టించుకోలేదు. దీంతో బాధితుడు మరోసారి ఫోరంను ఆశ్రయించగా అమెజాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది.
