అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khairatabad Ganesh | వినాయక చవితిని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులు ఘనంగా సాగుతాయి. హైదరాబాద్‌లో అయితే వినాయక చవితి పండుగను వైభవంగా నిర్వహిస్తారు. నగరంలోని ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించే గణేశుడి దర్శనానికి లక్షల మంది భక్తులు వస్తారు.
ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక చరిత్ర ఉంది. యేటా ఇక్కడ భారీ గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రుల పాటు విశేషాది పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి పండుగ ఉంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహ కర్రపూజ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా కర్రపూజ అనంతరం గణేష్ విగ్రహ పనులు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసే భారీ గణేశుడి ప్రతిమను ఇక్కడే తయారు చేస్తారు.
Khairatabad Ganesh | 69 అడుగుల ఎత్తు
ఖైరతాబాద్ వినాయకుడిని ఏటా వివిధ రూపాల్లో తయారు చేస్తారు. ఈ ఏడాది 69 అడుగుల మట్టి గణపతి ప్రతిమ ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈసారి.. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కాగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితికి 71 ఏళ్ల చరిత్ర ఉంది. 1954లో తొలిసారిగా విగ్రహం ప్రతిష్ఠించారు.
