అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Musi River | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కొందరు కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువులు, నాలాలను సైతం వదలడం లేదు. మూసీ నదిలో సైతం మట్టి పోసి కొందరు షెడ్లు నిర్మించారు. ఎకరాల కొద్ది భూమిని కబ్జా చేసి వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా (Hydraa) చర్యలు చేపట్టింది.
పాత బస్తీలోని చాదర్‌ఘాట్ (Chadarghat) బ్రిడ్జి నుంచి ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) వరకు మూసీ నదిని కొందరు ఆక్రమించారు. నదిలో మట్టిపోసి షెడ్లు నిర్మించడంతో పాటు పార్కింగ్ ప్లేస్‌లుగా వినియోగిస్తున్నారు. ఆక్రమణలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆయా ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైడ్రా సిబ్బంది మంగళవారం రంగంలోకి దిగారు.
Musi River | వాహనాల పార్కింగ్‌కు వినియోగం
మూసీ నదిని కొందరు ఆక్రమించి షెడ్లు నిర్మించారు. మట్టి పోసి ఆ ప్రాంతాలను చదును చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ఆ షెడ్లను కిరాయికి ఇస్తున్నారు. తికారాం సింగ్ అనే వ్యక్తి 3.10 ఎకరాల మేర కబ్జా చేసి షెడ్డు నిర్మించాడు. అందులో వ్యాపారం చేస్తున్నాడు. అలాగే పూనమ్ చాంద్ యాదవ్ 1.30 ఎకరాలు, జయకృష్ణ 5.22 ఎకరాల మేర కబ్జా చేశారు. ఆక్రమించిన భూమిలో వీరు షెడ్లు నిర్మించి.. అద్దెకు ఇస్తున్నట్లు హైడ్రా గుర్తించింది. దీంతో మంగళవారం అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చి వేశారు. అక్రమంగా వేసిన షెడ్లను తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Musi River | మూసాపేటలో ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలోని మూసాపేట (Moosapet) ఆంజనేయ నగర్‌లో మంగళవారం హైడ్రా కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్క్‌ను కబ్జా చేసి ఏర్పాటు చేసిన మతపరమైన జెండాను హైడ్రా సిబ్బంది తొలగించారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసుల బందోబస్తు మధ్య ఆక్రమణలను అధికారులు తొలగించారు.