అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Cherlapalli | హైదరాబాద్ నగరంలో మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) ఇటీవల భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని చర్లపల్లి పారిశ్రామికవాడలో వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్(Vagdevi Chemicals Lab)లో కొంతకాలంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన నిషేధిత మత్తు పదార్థాలను హైదరాబాద్, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో పోలీసులకు డ్రగ్స్ దొరికాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని దర్యాప్తు చేయగా హైదరాబాద్ అని తేలింది. దీంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
Cherlapalli Drugs Case | నెల రోజుల ముందే..
నెల రోజుల ముందుగానే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్‌లో రోజువారీ కూలీగా ముంబై కానిస్టేబుల్(Mumbai Constable) చేరారు. ల్యాబ్‌లో సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. దీంతో ముంబై పోలీసులు డ్రైవర్లు, రోజువారీ కూలీలుగా మరికొంత సిబ్బందిని ఇక్కడకు పంపించారు. పరిశ్రమలో డ్రగ్స్ తయారు చేస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాత దాడులు చేపట్టారు. రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేసే లిక్విడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్, విజయ్ ఓలేటి, తానాజి పట్వారీతో సహా పలువురిని అరెస్ట్ చేశారు.
Cherlapalli Drugs Case | కిలో రూ.50 లక్షలకు..
చర్లపల్లిలో తయారు చేసిన డ్రగ్స్‌ను ప్రధాన నిందితుడు విజయ్ ఓలేటి హైదరాబాద్(Hyderabad)లో విక్రయించాడు. కిలో రూ.50 లక్షల చొప్పున అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో ప్రత్యేక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ విక్రయాలు(Drug Sales) జరపడం గమనార్హం. చర్లపల్లితో పాటు, నాచారంలో డ్రగ్స్ తయారు చేసి విక్రయాలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Cherlapalli Drugs Case | అప్రమత్తమైన పోలీసులు
నగరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ దొరకడంతో హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) అప్రమత్తం అయ్యారు. నగరంలో డ్రగ్స్ అరికట్టడానికి ఈగల్ టీమ్ ఇటీవల దాడులు చేపడుతోంది. అయినా కూడా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తయారు చేస్తున్న విషయాన్ని నగర పోలీసులు గుర్తించలేకపోయారు. ముంబై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టే వరకు కూడా ఈ విషయం కనిపెట్టలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో నగరంలోని రసాయన ఫ్యాక్టరీలపై పోలీసుల ఫోకస్ పెట్టారు.
కెమికల్ ఫాక్టరీల వివరాలను ఆరా తీస్తున్నారు. అనుమతులు లేని కంపెనీలపై చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. చర్లపల్లి(Cherlapalli), జీడిమెట్ల, పాషామైలారంలో అనుమతులు లేని కంపెనీల వివరాలు సేకరిస్తున్నారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై తనిఖీలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.