అక్షరటుడే, కామారెడ్డి: SP Kamareddy | నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో (Nizamsagar police station) మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నేనవత్ కస్తూరి టీఎస్పీఎస్సీలో (TSPSC) ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (Extension Officer) గ్రేడ్–1గా ఎంపికైంది. ఈ సందర్భంగా మంగళవారం కస్తూరి ఎస్పీ రాజేష్ చంద్రను (SP Rajesh Chadra) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను ఎస్పీ అభినందించారు.
కాగా.. కస్తూరి బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ గ్రామానికి చెందిన ఏక్లారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో పదో తరగతి వరకు విద్యనభ్యసించింది. అనంతరం వరంగల్‌లో ఇంటర్, కోటి ఉమెన్స్ కాలేజ్‌లో (Koti Women’s College) డిగ్రీ పూర్తి చేసింది. 2024లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ఎంపికై నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఒకవైపు విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు తన చదువును కొనసాగించింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2025లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్–1 ఆఫీసర్ ఉద్యోగాన్ని సాధించింది.
పోలీస్ శాఖలో ఎదురయ్యే సమస్యలు, సమయాభావం మధ్య లభించిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించిన కస్తూరిని ఎస్పీ రాజేష్ చంద్ర మెమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కస్తూరి భవిష్యత్తులో మంచి పేరు సంపాదించి.. ప్రజలకు సేవ చేస్తూ తనదైన ముద్రను వేసుకోవాలని ఆకాంక్షించారు.
