అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Sai Chaitanya | కానిస్టేబుల్ ప్రమోద్ (constable Pramod) సేవలు మరువలేనివని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో దివంగత కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్థం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించే క్రమంలో ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహించారు.
CP Sai Chaitanya | సంఘ విద్రోహక శక్తులతో పోరాడుతూ..
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన సహచరుడు, కానిస్టేబుల్ ప్రమోద్ జ్ఞాపకార్థం ఈ ఫుట్‌బాల్ టోర్నీని నిర్వహిస్తున్నామన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశాడన్నారు. ఆయన సేవలు, ధైర్యసాహసాలు పోలీస్ విభాగానికి మాత్రమే కాదు.. సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ టోర్నీ ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందడమే కాకుండా.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకునే అవకాశం లభిస్తుందని సీపీ అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని పెంచి, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయన్నారు.
CP Sai Chaitanya | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అనేక మండలాల్లో యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేందుకు క్రీడాపోటీలు నిర్వహించిందని సీపీ గుర్తు చేశారు. ‘సే నో టు డ్రగ్స్’, ‘సే ఎస్ టు స్పోర్ట్స్’ అనే నినాదంతో యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే గత వారంలో ప్రారంభమైన ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా ప్రజల భద్రత రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను, ప్రమాద నివారణ సూచనలు గురించి ప్రస్తావించడం జరిగిందన్నారు. తోటి పౌరుల, కుటుంబ సభ్యుల భవిష్యత్తు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తగిన ప్రభుత్వం, పోలీసు వారు సూచించిన నియమాలు జాగ్రతలు పాటించాలని సీపీ సూచించారు.
CP Sai Chaitanya | కోవిడ్ మరణాల కంటే ఎక్కువ..
జిల్లాలో 2020, 2021లో జరిగిన కోవిడ్ మరణాలకన్నా గతేడాదిలో జరిగిన రోడ్డు ప్రమాద మృతులు ఎక్కువ అని సీపీ వివరించారు. అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించేలా అవగాహన కల్పించుకొని తాము, కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, తోటి ఉద్యోగులు, విద్యార్థులు, యువత కంకణం కట్టుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ కూడా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
CP Sai Chaitanya | ఆరు జట్లు..
ఈ టోర్నమెంట్లో ఆరు పురుషుల టీంలు, ఆరు మహిళల టీంలు ఫుట్‌బాల్ ఆడుతున్నాయని సీపీ తెలిపారు. గెలుపోటములు సర్వసాధారణమని, ప్రతిఒక్క క్రీడాకారులు టీం వర్క్‌తో ముందుకెళ్తే.. విజయం తప్పకుండా సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి , బోధన్ ఏసీపీ శ్రీనివాస్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మీర్ ఫారూఖ్ అలీ, డీవైఎస్వో పవన్ కుమార్, జిల్లా రంజీ క్రికెట్ ప్లేయర్ అంకిత్ రెడ్డి, ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జావిద్, జాయింట్ సెక్రెటరీ మసూద్, కోచ్ నాగరాజు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ పాల్గొన్నారు.