అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kavitha Janam Bata | రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. జనంబాటలో భాగంగా హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. అనంతరం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు.
ఎలక్ట్రిక్ బస్సుల (electric buses) పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడాకి ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. గతంలో హైదరాబాద్ నగరంలో 7,500 బస్సులు నడిచేవావన్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేశాక ఆ సంఖ్యను 3,500 తగ్గించారని ఆరోపించారు. దీంతో బస్సులు సరిపోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రవాణా వ్యవస్థ సరిగా లేకపోతే హైదరాబాద్ విశ్వనగరం ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు.
Kavitha Janam Bata | పంచాయతీ ఎన్నికలతో..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో హైదరాబాద్ నగరంలో జనం బాట చేపడుతున్నట్లు కవిత తెలిపారు. నవంబర్ 25న జనంబాట ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల కోడ్ ఉండటంతో ఆమె కొంతకాలంగా జీహెచ్ఎంసీ పరిధిలో జనంబాట చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలను గుర్తించినట్లు కవిత చెప్పారు. వీధి కుక్కల బెడద నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పారిశుధ్య కార్మికుల కొరతతో నగరంలో చెత్త పేరుకుపోతుందని చెప్పారు. సీతాఫల్ మండిలో ప్రభుత్వ పాఠశాలను కూలగొట్టి వదిలేశారన్నారు. వెంటనే కొత్త భవన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Kavitha Janam Bata | పెరిగిన క్రైమ్‌రేట్
నగరంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రైమ్‌రేట్ పెరిగిందన్నారు. డ్రగ్స్ వినియోగం సైతం పెరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, ఒంటరిగా ఉండేవారిపై కొంతమంది దాడులు చేస్తున్నారని చెప్పారు. లంగర్‌హౌజ్‌లోని బాపుఘాట్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నిర్వహణను గాలికి వదిలేయడంతో అధ్వానంగా మారిందన్నారు.
Kavitha Janam Bata | మెస్సీతో మ్యాచ్‌పై విమర్శలు
సీఎం రేవంత్‌రెడ్డి గంట ఎంటర్టైన్ మెంట్ కోసం రూ.పది కోట్లు ఖర్చు చేశారని కవిత విమర్శించారు. ఆయన ఫుట్‌బాల్ ఆడుతానని ప్రచారం చేసుకోవటానికి ఆడినట్లు ఉందన్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉందో చెప్పాలన్నారు. ఆ రూ.పది కోట్లను కూడా సింగరేణి బిడ్డల నిధి నుంచి ఖర్చు చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లకుండా మ్యాచ్ కోసం స్టేడియానికి వెళ్లారన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ఆయన ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు.