అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Project | బీఆర్ఎస్ (BRS) హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పేల్చేవేసే కుట్ర జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే నిర్మించిన మూడేళ్లకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ (Medigadda Barrage) కుంగింది. పిల్లల్లరకు పగుళ్లు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ విశ్వసనీయత దెబ్బతినేలా ప్రాజెక్ట్‌ను పేల్చే కుట్ర చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు.
కాళేశ్వరం నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ (Congress), బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణకు కమిటీ వేయగా ఇటీవల నివేదిక కూడా సమర్పించింది. ప్రాజెక్ట్ డిజైన్లు మార్చడం, ఇష్టారీతిన పనులు చేపట్టడంతోనే కూలిందని కమిషన్ నివేదిక (Kaleshwaram Commission Report) పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ కుంగిన సమయంలో శబ్దం వచ్చినట్లు ఏఈఈ రవికాంత్ ఫిర్యాదు చేశారన్నారు. అయితే కుంగితే శబ్దాలు రావని, ఎవరో కూల్చి వేసే ప్రయత్నం చేశారన్నారు.
Kaleshwaram Project | పిల్లర్లకు పగుళ్లు రావు
ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా.. పిల్లర్లకు పగుళ్లు రావని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. క్రస్ట్ గేట్లకు క్రాక్ వచ్చే అవకాశం ఉందని, కానీ పిల్లర్లకు రావన్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీలోని 20వ నంబర్ పిల్లర్‌కు కింద నుంచి పైవరకు క్రాక్ వచ్చిందన్నారు. కోటి ఎకరాలకు నీరు ఇచ్చి తెలంగాణను సస్య శ్యామలం చేసే ప్రాజెక్ట్‌ను పేల్చడానికి ఎవరో కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఐదు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు తట్టుకున్న మేడిగడ్డ.. అసలు ప్రవాహం లేనప్పుడు ఎలా కూలిపోతుందని ఆయన ప్రశ్నించారు.
Kaleshwaram Project | దీని వెనుక ఎవరున్నారో తేల్చాలి
మేడిగడ్డ కూల్చడానికి యత్నించిన అసాంఘిక శక్తులెవరో తేల్చాలి ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ దగ్గర పేలుళ్ల శబ్దాలపై ఎన్డీఎస్ఏ (NDSA) ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదికలో ఎక్కడా కూడా పేలుళ్ల ప్రస్తావన లేదన్నారు.
పునాది కింద నుంచి ఇసుక పోవడంతోనే కుంగిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. బుర్జ్ ఖలీఫా కన్నా ఏడింతల ఎక్కువ సిమెంట్ వాడి కట్టిన కాళేశ్వరంలో ఒక పిల్లర్‌కు క్రాక్ రావడం వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఫోన్ డేటాను అప్పుడు చెక్ చేసి ఉంటే నిందితులు దొరికేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనక ఆ ముగ్గురు ఉన్నారా లేదా అనేది పోలీసులు సిట్ ఏర్పాటు చేసి తేల్చాలన్నారు.