అక్షరటుడే, ఎల్లారెడ్డి: Former MLA Jajala | సిట్ విచారణ పేరుతో తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Jajala Surender) ఆరోపించారు. ఈ మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మను దహనం చేశారు.
Former MLA Jajala | రాజకీయ కక్షసాధింపు..
అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేసీఆర్‌పై కుట్రలకు తెరలేపిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం శోచనీయమని, ఇది రాజకీయ కక్షసాధింపునకు పరాకాష్ట అని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన రేవంత్ సర్కార్ దిక్కుతోచని స్థితిలో ఉందని విమర్శించారు.
Former MLA Jajala | రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడిపై..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్‌పై దుర్మార్గపు ప్రచారంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చిందని జాజాలా ఆరోపించారు. నాలుగు కోట్ల ప్రజల అభిమాన నాయకుడైన కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఎలాంటి సంబంధం లేని కేసుల్లో విచారించాలనే ప్రయత్నం దుర్మార్గమన్నారు. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ నాయకులపై విచారణల పేరుతో దాడులు చేయడం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కేసీఆర్‌పై చేస్తున్న నిందారోపణలకు ప్రజలే సరైన సమయంలో తగిన సమాధానం చెబుతారన్నారు.
Former MLA Jajala | బీఆర్ఎస్ పోరాటం ఆగదు..
నోటీసులు, విచారణల పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ శ్రేణుల పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ ఎల్లారెడ్డి మున్సిపల్ ఇన్‌ఛార్జి, మాజీ జడ్పీ ఛైర్మన్ దఫెదార్ రాజు, పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.