అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat elections | పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress party) జోరు కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన హస్తం పార్టీ, రెండో విడతలోను దూసుకు వెళ్తోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) ఆదివారం జరిగాయి.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరగ్గా.. 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టారు. చాలా గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి. దీంతో గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రెండో దశ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. రాత్రి 7 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం హస్తం పార్టీ 1,299 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 604, బీజేపీ 163, ఇతరులు 369 చోట్ల విజయం సాధించారు.
Panchayat elections | కాంగ్రెస్ సంబరాలు
రెండో విడతలోను కాంగ్రెస్ జోరు కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా అధికారంలో ఉండటంతో ప్రజలు హస్తం పార్టీకి గెలిపించినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పార్టీని గెలిపించాయని నాయకులు చెబుతున్నారు. కాగా బీసీ రిజర్వేషన్ల అంశం ఈ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని విపక్ష పార్టీలు విమర్శలు చేసినా.. పల్లెల్లో ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు.
Panchayat elections | ఎమ్మెల్యే స్వగ్రామంలో ఓటమి
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి ప్రజలు షాక్ ఇచ్చారు. సొంత గ్రామం చెర్లపాలెంలో ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో 82 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ గెలుపొందారు. ఝాన్సీ రెడ్డి అనుచరుడు కిరణ్ పై, రెబల్ అభ్యర్థి మహేందర్ విజయం సాధించారు. మడిపల్లి గ్రామంలో ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థిపై రెబల్ అభ్యర్థి గెలుపొందారు. సోమారం గ్రామంలో రెబెల్ అభ్యర్థి లింగమూర్తి 92 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం.