అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Election | పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం ఓట్లు సాధించిందని వివరించారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్లకు కేవలం 33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించిందని పేర్కొన్నారు. మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని చెప్పారు.
Panchayat Election | కాంగ్రెస్ ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 94 నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే.. 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించిందని చెప్పారు. బీఆర్ఎస్ 8 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపిందన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ (Jubilee Hills Constituency) ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించారన్నారు.
Panchayat Election | స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిగాయన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొన్నారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు (Ration Cards), 61 వేల ఉద్యోగాలు, రుణమాఫీ తదితర పథకాలపై ప్రజలు సంతోషంగా ఉందని చెప్పారు.
Panchayat Election | బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాలి
అధికారం పోయినా కొందరికి అహంకారం తగ్గలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూసీలో కాలుష్యం కంటే ఒకాయన మాటల్లో విషం ఎక్కువ అని అన్నారు. బరితెగించి ఇబ్బంది పెడదామంటే కుదరదన్నారు. ఫలితాలను చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 2029లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని హితవుపలికారు.