అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్ గెలుపు దాదాపుగా ఖాయం అయిపోయింది. ఆది నుంచి హస్తం పార్టీ అభ్యర్థి లీడ్లో ఉంటున్నారు. ప్రస్తుతం 8 రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ రౌండ్‌లో కాంగ్రెస్ 1,876 ఆధిక్యం సాధించింది.
ఉదయం 8 గంటలకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో (Kotla Vijaya Bhaskar Reddy Stadium) కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఆ తర్వాత వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు ఒక్క రౌండ్‌లో కూడా ఆ పార్టీ ఆధిక్యం సాధించలేదు. ఇప్పటి వరకు 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా.. మరో రెండు రౌంట్లు మిగిలి ఉన్నాయి. మరో గంటలో ఫైనల్ రిజల్ట్ తేలనుంది. ఎనిమిదో రౌండ్‌లో కాంగ్రెస్ 1,876 ఓట్ల లీడ్ సాధించగా.. మొత్తం 21,495 మెజారిటీతో గెలుపు దిశగా సాగుతోంది.
Jubilee Hills counting | రౌండ్ల వారీగా ఓట్ల వివరాలు..
పోస్టల్ బ్యాలెట్‌లో (postal ballot) బీఆర్ఎస్ – 36, కాంగ్రెస్ – 39, బీజేపీ – 10 పోస్టల్ ఓట్లు సాధించాయి. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) 8,911, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) 8,864 ఓట్లు సాధించారు. బీజేపీ 2,167 ఓట్లు సాధించింది. ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ 50,849, బీఆర్ఎస్ 37,990, బీజేపీ 8,569 ఓట్లు సాధించాయి.
కాంగ్రెస్ తొలిరౌండ్లో 47 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,947, మూడో రౌండ్‌లో 2,843, నాలుగో రౌండ్‌లో 3,558 ఐదో రౌండ్‌లో 3,178, ఆరో రౌండ్‌లో 2,938, ఏడో రౌండ్‌లో 4,030, ఎనిమిదో రౌండ్‌లో 1,876 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గాంధీ భవన్ వద్ద సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్కు (Gandhi Bhavan) వస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయం వెలవెలబోతుంది. ఉదయం పలువురు నాయకులు కార్యాలయానికి రాగా.. ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు.
ఐదో రౌండ్ కౌంటింగ్ పూర్తవగానే.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చివరి మూడు రౌండ్లు తమకు అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. తనకు డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నట్లు చెప్పారు.
