అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై కీలక సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉపఎన్నికల ఇన్‌ఛార్జి మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో గెలుపు అవకాశాలు, ప్రజానాడి ఎలా ఉందన్న అంశాలపై చర్చ జరిగింది. అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే అనుకూల ఫలితం రాగలదో విశ్లేషించారు. ప్రజాబలం, ప్రాంతీయ మద్దతు, ఆర్థిక స్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది అభ్యర్థి పేరును త్వరలోనే అధిష్టానం ఖరారు చేయనుంది.
Jubilee Hills | టికెట్ రేసులో ఉంది వీరే..
- నవీన్ యాదవ్ – గత ఎన్నికల్లో తృటిలో ఓడిన యువ నేతగా ముందంజలో ఉన్నారు
- అంజన్ కుమార్ యాదవ్ – మాజీ ఎంపీగా రాజకీయ అనుభవం
- బొంతు రామ్మోహన్ – మాజీ మేయర్‌గా నగరంలో మంచి పట్టు
- సీఎన్ రెడ్డి – రెహమత్ నగర్ కార్పొరేటర్‌గా బలమైన స్థానిక మద్దతు
ఇంకా పలువురు ఆశావాహులు పోటీలో ఉన్నప్పటికీ, పార్టీ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ నలుగురి పేర్లు తుది జాబితాలో నిలిచాయి. వీరి పేర్లను త్వరలో కాంగ్రెస్ (Congress) అధిష్ఠానానికి పంపించి, అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం. సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయి. అభ్యర్థిని జాగ్రత్తగా ఎంపిక చేస్తే, స్థానిక నాయకులతో సమన్వయం పెంచుకుంటే భారీ మెజార్టీ సాధించవచ్చు’’ అని స్పష్టం చేశారు. అంతేగాక, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బీఆర్‌ఎస్ పరిపాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టం, కేంద్ర ప్రభుత్వ ఆమరణ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
అన్ని వర్గాలను ఆకర్షించే అభ్యర్థిని ఎంపిక చేసి మెజార్టీతో గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో కసరత్తు ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. అభ్యర్థి పేరు అధికారికంగా ప్రకటించేవరకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగనుంది. పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయం ఈ ఉపఎన్నిక ఫలితంపై కీలక ప్రభావం చూపనుంది.