అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Bandh | బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC chief Mahesh Goud) స్పష్టం చేశారు. బీసీ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న తెలంగాణ బంద్‌కు (Telangana bandh) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ బంద్‌కు మద్దతు తెలపాలని బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజులా శ్రీనివాస్‌గౌడ్ గురువారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు (BC reservations) అనేది తమ పార్టీ ఎజెండా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ బంద్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేస్తారని తెలిపారు. కాగా బీసీ సంఘాల బంద్‌కు ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ (BRS and BJP) మద్దతు ఇచ్చాయి. తాజాగా అధికార పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో 18న రాష్ట్రంలో బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉండే అవాకశం ఉంది.
Telangana Bandh | బీసీలంటే భయపడే స్థాయికి తెస్తాం: కృష్ణయ్య
పీసీసీ చీఫ్‌తో భేటీ అనంతరం బీసీ నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామని హెచ్చరించారు. బీసీలకు కోర్టులు అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18న పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. బంద్‌లో అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒక్క మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు తిరగొద్దని హెచ్చరించారు. ప్రజలు ఆవేశంగా ఉన్నారని, బస్సులు తిరిగితే దాడులు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.