అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kamareddy | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించ తలపెట్టిన బీసీ కృతజ్ఞత సభ ( BC appreciation meeting) వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సభను వాయిదా వేయాలని అధికార పార్టీ నిర్ణయించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై (BC reservations) మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తరుణంలో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తలచింది.
ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ సభ (BC Declaration meeting) నిర్వహించారో అక్కడే కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో (Kamareddy) జరిగిన బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేసింది. అప్పట్లో పార్టీ అగ్ర నేతలతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపంచింది. అది ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ, బీసీలకు 42 శాతం కోటా పెంచుతూ జీవో జారీ చేసింది.
Kamareddy | కృతజ్ఞత సభ..
వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు గాను భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ కృతజ్ఞత సభ నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress President Mallikarjuna Kharge), రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ప్రియాంకగాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆహ్వానించారు.
ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. పలువురు మంత్రులు కూడాఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే, సభకు గడువు సమీపిస్తున్న తరుణంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. ఇప్పటికే భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండగా, మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సభను వాయిదా వేయాలని నిర్ణయించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే నిర్ణయించనుంది.