అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Congress Protest | ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసన చేపట్టింది. గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఆ పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టింది. పాత చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్ (VB-G RAM G) ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ (Mahatma Gandhi) చిత్రపటాలను చేతిలో పట్టుకుని నినాదాలు చేశారు. రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి, దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Congress Protest | నిరసన ప్రదర్శన
మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఏ (NREGA) అని రాసి ఉన్న భారీ బ్యానర్‌ను పట్టుకుని గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనగా నడిచారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), అగ్రనేత సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, డీఎంకే ఎంపీ కె.కనిమొళి, బాలు, ఎ రాజా, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Congress Protest | అనేక సమస్యలు
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కొత్తచట్టంతో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి, జీవనోపాధి లేదా ఉపాధిపై దాని దృష్టిని స్పష్టంగా ప్రతిబింబించని కొత్త పేరు పెట్టారని చెప్పారు. పథకం స్వరూపాన్ని మార్చారని ఆరోపించారు. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం వాటాగా ఉండేవన్నారు. మాణికం ఠాగూర్ మాట్లాడుతూ ఇది ఒక ప్రజాస్వామ్య పోరాటం అన్నారు. తాము గాంధీ వారసత్వాన్ని కాపాడడానికి పోరాడుతున్నామని చెప్పారు. గాడ్సే భావజాలం ఉన్నవారు ఎల్లప్పుడూ మహాత్మా గాంధీ పేరును చెరిపివేయడానికి ప్రయత్నిస్తారని తమకు తెలుసన్నారు.