అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Congress | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు రోడ్డెక్కింది. ఎమ్మెల్యేల ధిక్కార స్వరం పెరుగుతోంది. సొంత పార్టీ శాసనసభ్యులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు.
అధికారంలో ఉన్నామనే అహంకారంతో కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సర్కారుకు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న విభేదాలు, మనస్పర్థలు సాధారణమేనని పార్టీ నాయకత్వం కొట్టిపడేస్తుండడం కేడర్‌ను కలవరపెడుతోంది. ప్రజల్లో ప్రభుత్వంతో పాటు పార్టీ పలుచన అవుతున్న తరుణంలో తమ వారిని కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సరైన రీతిలో స్పందించక పోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
Congress | అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైనా..
కాంగ్రెస్‌లో (Congress) అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని పార్టీ నేతలు చెబుతారు. అయితే, అది శ్రుతి మించుతుండడమే ఆందోళన కలిగిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, సొంత పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుండడం హైకమాండ్‌ను (High Command) కలవరపెడుతోంది. సహచర మంత్రులు ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి నెలకొంది. బహిరంగంగానే విమర్శించుకుంటుండడంతో సర్కారు చిక్కుల్లో పడుతోంది. ఇక కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అతి కారణంగా ప్రభుత్వం, పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మిగతా పార్టీల్లో క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. గీత దాటితే వేటు వేస్తారన్న భయం ఉంటుంది. కానీ, కాంగ్రెస్‌లో అందుకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరించడం సాధారణమే.
Congress | మంత్రుల మధ్య రచ్చరచ్చ..
కేబినెట్లో సమన్వయం లోపించింది. రోజురోజుకు అమాత్యుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్-అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్-అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదాలు రచ్చకెక్కాయి. అడ్లూరి లక్ష్మణ్‌ను బాడీ షేమింగ్ చేస్తూ పొన్నం మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇది కాస్త తీవ్ర వివాదం కావడంతో పీసీసీ నాయకత్వం పిలిచి మాట్లాడి సర్దిచెప్పింది. వివాదం సద్దుమణిగిపోయిందని భావిస్తున్న తరుణంలో వివేక్, అడ్లూరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది కొనసాగుతుండగానే, కొండా సురేఖ-పొంగులేటి వివాదం బయటికొచ్చింది. తమ శాఖలో జోక్యం చేసుకోవడాన్ని కొండా సురేఖ (Konda Surekha) బహిరంగంగానే విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అంతకు ముందు నల్లగొండ జిల్లా మంత్రుల మధ్య కూడా విభేదాలు బయటపడ్డాయి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ వినియోగంపై పలువురు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నెలకొనడం అప్పట్లో కలకలం రేపింది.
Congress | ఎమ్మెల్యేలది మరో తీరు..
మంత్రుల తీరు అలాగుంటే, ఎమ్మెల్యేల తీరు మరీ దారుణంగా ఉంది. ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి దిగారు. మంత్రి పదవి రాలేదని అలక బూనిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ముఖ్యమంత్రిపైనే పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) అసెంబ్లీలో చర్చ పెడితే ఆయన హాజరు కూడా కాలేదు.
రాష్ట్రంలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు సమావేశాలు అవసరమా? అని ఆయన అసెంబ్లీ సాక్షిగానే ప్రశ్నించారు. మద్యం టెండర్ల విషయంలోనూ ఆయన సర్కారును ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. ఇక, మరో ఎమ్మెల్యే సైతం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. సంచులు మోసే వాళ్లు పార్టీకి అవసరం లేదని, హంతకులు, రౌడీషీటర్లకు పార్టీలో స్థానం లేదని వ్యాఖ్యలు చేయడం సీఎంను ఉద్దేశించే చేసినవనే ప్రచారం జరిగింది. ప్రభుత్వం కూలితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం విశేషం. ఇక, కులాల వారీగా, గ్రూపుల వారీగా ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహిస్తుండడం గమనార్హం. మాల, మాదిగ, గిరిజన సామాజిక వర్గాల వారీగా విడిపోయారు. యువ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక హోటల్లో రహస్యంగా సమావేశం కావడం రేపింది.
Congress | సమన్వయం చేయడంలో విఫలం
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో (Telangana) పార్టీ మనుగడనే ప్రశ్నార్థకమైన పరిస్థితుల నుంచి అనూహ్యంగా పుంజుకుని గద్దెనెక్కింది. అయితే, కేసీఆర్ సర్కారుపై వ్యతిరేకతే కాంగ్రెస్‌కు అవకాశం తీసుకొచ్చింది. కాంగ్రెస్‌ను మెచ్చి ప్రజలు ఓటేయలేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాన్ని భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో హస్తం వైపు మొగ్గు చూపారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కాంగ్రెస్ కలహాలతో సతమతమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను సమన్వయం చేయడంలో ముఖ్య నేతలు ఘోరంగా విఫలమయ్యారనే భావన నెలకొంది.